Hyderabad | న్యూఢిల్లీ, జూలై 27: లగ్జరీ హౌజింగ్ సెగ్మెంట్లో హైదరాబాద్ నగరం అత్యంత ఆకర్షణీయంగా మారుతున్నది. గురువారం సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన గణాంకాల్లో.. దేశంలోని టాప్-7 నగరాల్లో హైదరాబాద్ వృద్ధిరేటు అన్నింటికంటే ముందున్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చైన్నై, పుణె నగరాల్లో రూ.4 కోట్లు, ఆపై విలువ కలిగిన లగ్జరీ ఇండ్ల అమ్మకాల వివరాలను సీబీఆర్ఈ తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 121 శాతం వృద్ధితో మొత్తం 3,100 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో 1,400 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మార్కెట్లో పుంజుకున్న డిమాండ్ దృష్ట్యా బడా రియల్టర్లు.. మరిన్ని లగ్జరీ హౌజింగ్ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు.
50 నుంచి 1,000 యూనిట్లకు..
నిరుడు ఏప్రిల్-జూన్‌లో హైదరాబాద్‌లోని లగ్జరీ ఇండ్ల అమ్మకాలు కేవలం 50 యూనిట్లుగానే నమోదయ్యాయి. అయితే ఈ ఏప్రిల్-జూన్‌లో అవి ఏకంగా 1,000కి పెరిగాయి. దీంతో 20 రెట్లు వృద్ధి కనిపించింది. హై నెట్‌వర్త్, అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివీడ్యువల్స్ ప్రాపర్టీ కొనుగోళ్లకు దిగుతుండటం కలిసొస్తున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో లగ్జరీ హౌజ్ సేల్స్ గతంతో చూస్తే ఈ ఏప్రిల్-జూన్‌లో 350 నుంచి 1,050కి పెరిగాయి. ఇక పుణెలో ఈసారి మాత్రమే అమ్మకాలు జరిగాయి. 150 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నై, కోల్‌కతాల్లో 50 యూనిట్ల చొప్పున అమ్ముడవగా, ముంబైలో మాత్రం 800 యూనిట్ల నుంచి 750 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో కూడా 100 నుంచి 50 యూనిట్లకు లగ్జరీ హోమ్ సేల్స్ దిగజారినట్టు సీబీఆర్ఈ స్పష్టం చేసింది.
మొత్తం ఇండ్ల విక్రయాల్లో..
ఈ ఏడాది జనవరి-జూన్‌లో లగ్జరీ ఇండ్లుసహా మొత్తం నివాస గృహాల అమ్మకాలు 1,54,000 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు ఇదే వ్యవధిలో 1,51,000 యూనిట్లుగా ఉన్నట్టు సీబీఆర్ఈ ఈ సందర్భంగా తెలియజేసింది. కొత్త ప్రాజెక్టుల్లో 9 శాతం వృద్ధి కనిపించిందన్నది. కాగా, గృహ రుణాలపై వడ్డీరేట్లు గతకొంత కాలంగా స్థిరంగా ఉండటం మార్కెట్‌కు కలిసొస్తున్నదని ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీరేట్లు ఇలాగే ఉంటే రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరింత ఉత్సాహం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
‘ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో దేశీయ లగ్జరీ హౌజింగ్ సెగ్మెంట్లో నమోదైన వృద్ధి చాలా ఆకర్షణీయం. ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లోనూ ఇదే ఆదరణ ఉంటుందని అనుకుంటున్నాం. వడ్డీరేట్లలో స్థిరత్వం, రాబోయే పండుగ సీజన్ అమ్మకాలకు కలిసి రాగలదు’
-అన్షుమన్ మ్యాగజైన్,సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో
‘లగ్జరీ హౌజింగ్ రంగంలో బలమైన అమ్మకాలు ఇకపైనా నిలకడగానే కొనసాగవచ్చు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ ఇందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అద్దెలకు లగ్జరీ హోమ్స్‌ను తీసుకునేందుకూ చాలామంది ఆసక్తి కనబరుస్తుండటంతో ఈ సెగ్మెంట్ ఇప్పుడు ఆకర్షణీయంగా ఉన్నది’
-ఆకాశ్ ఓహ్రీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఈడీ