హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు సంస్థలు వచ్చిచేరాయి. శనివారం నగరంలో రెండు ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభించాయి. వీటిలో ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించగా..మరో సంస్థ డార్క్ మ్యాటర్ టెక్నాలజీస్ నూతన ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ..కొత్త ఐటీ కంపెనీలు తమ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలు, ఐటీ సేవలు అందించడానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఇక్కడ పుష్కలంగా లభించడం కారణమన్నారు. హైదరాబాద్ నగరం సాస్(సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీసు)కు ప్రధాన కేంద్రంగా మారిందని, ముఖ్యంగా కొత్త టెక్నాలజీ కృత్రిమ మేధస్సుపై ఐటీ కంపెనీలు ప్రధానంగా దృష్టిని సారిస్తున్నాయన్నారు.