హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీ-హబ్‌కు బీజం పడి బుధవారం (నవంబర్ 5)తో పదేండ్లు పూర్తయింది. దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణల వ్యవస్థను తీసుకురావడంతో స్టార్టప్‌లకు స్వర్గధామంగా టీ-హబ్ విరాజిల్లుతున్నది. కేవలం ఐటీ రంగంలోనేగాక.. ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లు సైతం ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ మెరుగుపడటానికి మానవ వనరులు అవసరమని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేశారు. టీ-హబ్ స్ఫూర్తితో వీ-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీవర్క్స్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)లను ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు భారీ ఊతం అందించాయి.
ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా టీ-హబ్ నిలుస్తుందని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇప్పటికే ప్రత్యేకంగా కొనియాడారు. వినూత్న ఆవిష్కరణలతో వచ్చిన స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీ-హబ్ దేశానికి గర్వకారణమని ఎన్నారైలు సైతం ప్రశంసించారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఆంత్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడంతో తెలంగాణ ఆరు రాష్ర్టాలతో కలిపి టాప్‌లో నిలిచినట్టు గత ఏడాది కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్ స్పష్టం చేయడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, టెక్ ఎకో సిస్టమ్, ప్రభుత్వ పాలసీలతోనే ఇది సాధ్యమైంది. ఐటీని టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరించాలని జిల్లా కేంద్రాల్లో టీ-హబ్‌లను కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ-హబ్‌ను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో ఎం-హబ్‌ను నిర్మిస్తున్నారు. నాడు కేసీఆర్ హయాంలో ఐటీ అభివృద్ధికి అనేక పాలసీలు తీసుకొచ్చారు. టీఎస్ఐపాస్ను ప్రవేశపెట్టి కొత్తగా కంపెనీ పెట్టాలనుకునే -వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా మొదటి రోజు నుంచే కార్యకలాపాలు సాగించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా కంపెనీలు వివరాలు అందిస్తే 15 రోజుల్లోనే పూర్తి స్థాయి అనుమతి పొందేలా వెసులుబాటు కల్పించారు. ఒకవేళ 15 రోజుల తర్వాత కంపెనీకి ఏవైనా కారణాలతో అనుమతి లభించకపోతే ఆ మరుసటి రోజు నేరుగా అనుమతి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇక అప్పటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తీసుకొచ్చిన ఇలాంటి వెసులుబాట్లనే కంపెనీలను ఆకర్షించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురానుండటం విశేషం.
టీ-హబ్‌తో స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కేసీఆర్ దార్శనికతతో సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాం. తద్వారా హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు క్యాపిటల్‌గా తీర్చిదిద్దాం. టీ-హబ్‌తో తొలి అడుగు పడగా.. దాని తర్వాత వీ-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ-వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)లతో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లాం. టీ-హబ్ ఆధునిక భారతదేశ ముఖచిత్రంగా నిలుస్తున్నదని నాడు రతన్ టాటా చెప్పడం గర్వకారణం. దశాబ్దకాలంగా టీ-హబ్ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం, ఐటీ మంత్రిగా పనిచేసిన నాకూ ఇది గర్వకారణమే. ఆవిష్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు వందలాది టెక్ స్టార్టప్‌లు వాటి లక్ష్యాలు చేరుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్న టీ-హబ్ ఎప్పటికీ అభినందనీయమే.
-‘ఎక్స్’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్