హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వ్యాప్తంగా జీసీసీలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మౌలిక వసతులు, తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్‌కు గ్లోబల్ ఇంజిన్‌గా నిలుస్తున్న జీసీసీలు తమ కార్యకలాపాల విస్తరణకు భాగ్యనగరాన్ని ఎంచుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో జీసీసీలు తమ సెంటర్ల ఏర్పాటుకు 2020-24 మధ్య కాలంలో 1.86 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ మేరకు ‘సావిల్స్ ఇండియా’ తన తాజా అధ్యయనంలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
దేశవ్యాప్తంగా జీసీసీల ఆకట్టుకుంటున్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలుస్తున్నది. తొలి నగరంగా బెంగళూరు కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో భాగ్యనగరం నిలుస్తున్నదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2020 నుంచి 2024 మధ్యకాలంలో లీజుకుతీసుకుంటున్న స్థలాల్లో హైదరాబాద్ 17 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. 38 శాతంతో బెంగళూరు మొదటి స్థానంలో నిలువగా..14 శాతంతో ఆ తర్వాత స్థానంలో పుణె, 11 శాతంతో ఢిల్లీ, 11 శాతంతో చెన్నై, 8 శాతంతో ముంబై నిలిచాయి. దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటులో తొలి మూడు నగరాల వాటా 86 శాతంగా ఉండటం విశేషం. 2020-24 మధ్య కాలంలోవాణిజ్య సంస్థలు 262 మిలియన్ చదరపు అడుగులు అద్దెకు తీసుకోగా.. ఇందులో జీసీసీలు 112 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు నివేదిక వివరించింది. ఈ మొత్తం స్థలంలో జీసీసీల వాటా 43 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2025-30 మధ్య కాలంలో జీసీసీలు దేశంలో 3 కోట్ల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని అద్దెకు తీసుకునే అవకాశాలున్నట్టు సావిల్స్ ఇండియా అధ్యయనం విశ్లేషించింది.
హెల్త్ కేర్, ఫార్మా రంగాలు అత్యధికంగా జీసీసీలను ఆకర్షించడంతో హైదరాబాద్ హబ్‌గా మారిందని పేర్కొంది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు, నైపుణ్యం కలిగిన యువత లభించడం, తక్కువ జీవన వ్యయం కారణంగా జీసీసీలు ‘క్యూ’ కడుతున్నట్టు రిపోర్టు పేర్కొంది. పర్యావరణ అనుకూల సదుపాయాలు, హైబ్రిడ్ పని విధానాల కారణంగా జీసీసీలు నగరానికి వస్తున్నట్టు తెలిపింది. టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థలు తమ జీసీసీలను ఏర్పాటు చేయడానికి నగరానికి తొలి ప్రాధాన్యతనిస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రతిభ కలిగిన ఉద్యోగాలు లభిస్తుండటం, అమెరికా, యూకేతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఉద్యోగులు దొరకడం, తక్కువ ఆఫీసు అద్దె, తమకు అనుకూలంగా ఉండే మారకపు విలువ కారణంగా జీసీసీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నట్టు రిపోర్టు తెలిపింది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యక్తుల ఆధారంగా కాకుండా వ్యవస్థను పటిష్ఠపర్చడం ద్వారా అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మారు. మరోవైపు నాడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు హైదరాబాద్‌కు జీసీసీలు ‘క్యూ’ కట్టేలా చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానంతో కంపెనీ పెట్టిన తొలి రోజు నుంచే కార్యకలాపాలు నిర్వహించుకునేలా వ్యవస్థను రూపొందించారు. ఆన్లైన్ ద్వారా కంపెనీ వివరాలు అందించి 15 రోజుల్లో కార్యకలాపాలు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఏదైనా కారణాలతో 15 రోజుల తర్వాత అనుమతి లభించకుంటే ఆ మరుసటి రోజు నుంచే ఆన్లైన్ ద్వారా నేరుగా అనుమతి వచ్చేలా టీఎస్ఐపాస్ను రూపొందించారు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా యువతలో నైపుణ్యాలు పెంపొందించారు. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చారు. జీసీసీ సెంటర్లకు సైతం టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో, అద్భుతమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇండస్ట్రియల్ పార్క్‌లు, డాటా కనెక్టివిటీలతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్లను బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించడంతో బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో నేడు ఆ ఫలితాలు మన కండ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం ఉన్న జీసీసీలు 1800
మొత్తం ఉద్యోగులు 19 లక్షల మంది
2030 నాటికి దేశంలో జీసీసీలు 2200
మొత్తం ఉద్యోగులు 28లక్షలకు చేరుకుంటారని అంచనా