హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : రియల్ ఎస్టేట్ మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ హైదరాబాద్ నగరం అగ్ర స్థానంలో స్థిరపడింది. గతేడాది కరోనా మహమ్మారి వెంటాడినా ఇతర మెట్రో నగరాలను వెనక్కినెట్టి ముందంజలో నిలిచింది. ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ విభాగంలో బెంగళూరును దాటేసి ప్రథమ స్థానంలోకి భాగ్యనగరం దూసుకొచ్చింది. ఇక దేశంలోని మెట్రో నగరాల్లో మొట్టమొదటిసారి ఇల్లు కొంటున్నవారికి ఇష్టమైన నగరంగానూ హైదరాబాద్ ఖ్యాతిని ఆర్జించడం విశేషం. ఈ క్రమంలోనే నిరుడు గృహ నిర్మాణ రంగంలో దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా 142 శాతం వృద్ధిరేటును కనబర్చిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించింది.
సొంతింటి కల సాకారానికి భాగ్యనగరమే
ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బ్రోకరేజి సంస్థ నోబ్రోకర్.కామ్-2021 నివేదిక ప్రకారం మొట్టమొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేసేవారి సంఖ్య హైదరాబాద్‌లో 69 శాతంగా ఉన్నది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే ఇదే ఎక్కువ. ప్రధాన నగరాల్లో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగళూరు (61 శాతం), ముంబై (60 శాతం), ఢిల్లీ ఎన్సీఆర్ (57 శాతం), చెన్నై (53 శాతం), పుణె (49 శాతం) ఉన్నాయి. చౌక వడ్డీరేటుతోపాటు హైదరాబాద్‌లో ఉన్న అనుకూల అంశాలు కలిసొస్తున్నాయి.
ఆఫీస్ స్పేస్‌లో దూకుడు
దేశంలో ఐటీ రాజధానిగా బెంగళూరు మొదట్నుంచీ ఆఫీస్ స్పేస్ వినియోగంలో ముందంజలో ఉంటూ వస్తున్నది. అయితే గతేడాది నాల్గో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో హైదరాబాద్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేండ్ల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించింది. దీనికితోడు గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు సైతం పెట్టుబడులను ఆకర్షించేలా చేసింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దాని ఫలితంగానే ఇక్కడ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరిగిందని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.