న్యూఢిల్లీ, జూలై 12: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ దిగ్గజాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు ధరలను పెంచుతూనే మరోవైపు రాయితీల రూపంలో కస్టమర్లను కొనుగోళ్ల వైపు ఆకర్షిస్తున్నాయి. దీంట్లోభాగంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..తన ఈవీ మాడళ్లపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం సంస్థ కర్వ్ ఈవీ, హారియర్ ఈవీలను తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులోవుండనున్న ఈ ఆఫర్ ఎంపిక చేసిన నగరాల్లో అందిస్తున్నది. టాటా టియాగో ఈవీపై రూ.40 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. దీంట్లో రూ.20 వేలు నగదు రూపంలో డిస్కౌంట్, మరో రూ.20 వేలు ఎక్సేంజ్ బోనస్ కింద పొందవచ్చునని తెలిపింది.
అలాగే టాటా పంచ్ ఈవీపై కూడా రూ.20 వేల నగదు ప్రయోజనాలు, మరో రూ.20 వేలు ఎక్సేంజ్ బోనస్ కింద లభించనున్నాయి. అలాగే మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ మాడల్పై రూ.30 వేలు డిస్కౌంట్ కల్పిస్తున్నది. దీంతోపాటు అదనంగా ఆరు నెలలపాటు ఉచితంగా చార్జింగ్, లాయల్టీ ప్రయోజనాలు కూడా అందిస్తున్నది. అలాగే కర్వ్ ఈవీపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. దీంతోపాటు ఆరు నెలలపాటు టాటా పవర్ చార్జింగ్ స్టేషన్లలో ఉచితంగా చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.