Telangana | హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్కి పారిశ్రామిక వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇదే క్రమం లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,476 పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు మంజూరయ్యాయి. వీటిద్వారా రూ. 9,850 కోట్ల పెట్టుబడులు రానుండగా, తద్వారా 38,598 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ పరిశ్రమల అనుమతుల్లో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా ములుగు జిల్లా చివరిస్థానానికి పరిమితమైంది. మేడ్చల్‌లో 262 యూనిట్ల ఏర్పాటునకు సంబంధించి అనుమతులు లభించగా.. ములుగులో కేవలం 5 మాత్రం ఏర్పాటయ్యాయి. అలాగే, రూ.5,155 కోట్ల పెట్టుబడులు, 8,857 మందికి ఉపాధి అవకాశాలతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానాన్ని కైవ సం చేసుకున్నది.
ప్రభు త్వం విడుదల చేసిన 2024-25 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఈ విషయం వెల్లడైంది. కొత్త పరిశ్రమల అనుమతులు, ఉపాధి అవకాశాల విషయంలో జిల్లాలవారీగా చూసుకుంటే అత్యధికంగా మేడ్చల్-మల్కాజ్గిరి. సంగారెడ్డి, రంగారెడ్డి ప్రథమ మూడు స్థానాల్లో నిలిచాయి. పెట్టుబడుల విషయంలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి 1, 3 స్థానాల్లో ఉన్నాయి.
తయారీ రంగంలో ఏర్పాటైన పరిశ్రమల్లో అత్యధికంగా 67.23 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. వీటిపై పెట్టుబడి మాత్రం అత్యల్పంగా 1.70శాతం కాగా, ఉద్యోగావకాశాల్లో 24.97శాతంతో చిన్న పరిశ్రమల తరువాతి స్థానంలో ఇవి నిలిచాయి. భారీ పరిశ్రమల విషయానికొస్తే, మొత్తం యూనిట్లలో వీటి వాటా 0.96 శాతం మాత్రమే కాగా, పెట్టుబడుల్లో 52.55 శాతం, ఉపాధిలో 22.99 శాతం వాటా ఉంది. చిన్న పరిశ్రమల వాటా 27.74 శాతం కాగా, మధ్యతరహా పరిశ్రమల వాటా 12.25 శాతం వాటా ఉంది. అలాగే పెట్టుబడుల్లో మధ్య తరహా పరిశ్రమల వాటా 12.06శాతం ఉండగా, చిన్న పరిశ్రమల వాటా 11.28శాతంగా ఉంది.
తెలంగాణలో అన్ని రకాల కార్మికుల్లో 22.75 శాతం పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 56.40శాతం తయారీ రంగంలో పనిచేస్తుండగా, 41.10శాతం మంది నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. మైనింగ్‌లో 1.01 శాతం, ఎలక్ట్రికల్సహా ఇతర రంగాల్లో 1.49శాతం మంది పనిచేస్తున్నారు. పరిశ్రమలు, వాటి అనుబంధ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 55.65శాతం, పట్టణ ప్రాంతాల్లో 57.41 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. తయారీరంగ పరిశ్రమల్లో 77.3 2శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్లు, నిర్మాణ రంగంలో పురుషులు 52.87 శాతం ఉండగా, మహిళలు 22.68శాతం మంది పనిచేస్తున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.