పెట్టుబడులను మొదలు పెట్టాలనుకునేవారికి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఓ రిస్క్ లేని మార్గం. ప్రస్తుతం పొదుపు పథకాలన్నింటిపైనా రాబడి తగ్గిపోయినందున అధిక ఆదాయాన్నిచ్చే మదుపు మార్గాల వైపు చూడటం సహజమే. అయి తే నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై అవగాహన లేకపోతే చాలా రిస్క్. అందుకే పరోక్ష పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమం. అయితే కొన్ని వందల స్కీముల్లో దేనిలో ఇన్వెస్ట్ చేయాలనేదానిపై అనేక సందేహాలు.
ఈఎల్ఎస్ఎస్
తొలిసారిగా మదుపు చేయాలనుకునేవారు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్)ల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితం. వీటిలో పన్ను ఆదా ప్రయోజనం ఉంటుంది. మూడేండ్ల లాక్ ఇన్ పీరియడ్‌తో ఉండే ఈ స్కీముల్లో.. రాబడి మిగతా మ్యూచువల్ ఫండ్ స్కీముల కన్నా కాస్త ఎక్కువే. లాక్ ఇన్ పీరియడ్‌తో తరచుగా వాటివైపు చూడాల్సిన అవసరంగానీ, మార్కెట్ పతనాల్లో ఆందోళన చెందాల్సిన పనిగానీ ఉండదు. సగటున గత పదేండ్లలో స్టాక్ మార్కెట్ 14.4 శాతం వార్షిక రాబడిని అందిస్తే, ఎంఎఫ్‌ల్లో 20 శాతంపైగానే రాబడి ఉన్నది.
హైబ్రిడ్ ఫండ్లు
వీటినే బ్యాలన్స్డ్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీల్లో, రుణసాధనాల్లోనూ మదుపు చేసేవే ఈ హైబ్రిడ్ ఫండ్లు. మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు ఈక్విటీల్లో మదుపు తగ్గించి, కచ్చితమైన రాబడినిచ్చే రుణ సాధనాల్లో అధిక మొత్తాలను ఈ ఫండ్ మేనేజర్లు మదుపు చేస్తారు. మార్కెట్ అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఈక్విటీల్లో అధిక కేటాయింపులు చేయడం ద్వారా వీటిలో కూడా రాబడులు అధికంగానే ఉంటాయి.
డెట్ ఫండ్లు
రుణ సాధనాల్లో మాత్రమే మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లు ఇవి. వీటిలో రిస్క్ చాలా తక్కువ. అలాగే రాబడి కూడా ఈక్విటీ ఫండ్లతో పోల్చితే తక్కువే. ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, కార్పోరేట్ డెట్ సాధనాల్లో మదుపు చేస్తాయి. బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా రాబడి అధికంగానే ఉంటుంది. రిస్క్ లేకుండా నిర్ధిష్టమైన రాబడి కావాలనుకునేవారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. పైన పేర్కొన్న మ్యూచువల్ ఫండ్లలో నేరుగా ఏకమొత్తంగా మదుపు చేసే వీలుండటంతోపాటు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (ఎస్ఐపీ) ద్వారా కూడా మదుపు చేయవచ్చు.