న్యూఢిల్లీ, నవంబర్ 22:యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు హోండా గుడ్‌బై పలుకబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఎంతో ఆర్భాటంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన జపాన్ వాహన సంస్థ హోండా..ఈ స్కూటర్‌కు డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ గడిచిన నాలుగు నెలలుగా ఉత్పత్తిని నిలిపివేసినట్టు తెలుస్తున్నది. దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం బట్టబయలు అయింది.
ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఆరు నెలలపాటు 11,168 యూనిట్ల ఎలక్ట్రిక్ యాక్టివా ఈ, క్యూసీఐ మాడళ్లను ఉత్పత్తి చేసింది. వీటిలో సగం 5,201 యూనిట్లను డీలర్లకు డెలివరీ చేసింది. విక్రయాలు ఆ స్థాయిలో లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్టు తెలుస్తున్నది. ఈ 5,201 యూనిట్లలో 4,461 యూనిట్లు క్యూసీఐ మాడల్ కాగా, మిగతా 740 యాక్టివా ఈ మాడల్ మాత్రమే.
తన బ్రాండ్ నుంచి తొలి ఈ-స్కూటర్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం హోండా యాక్టివా ఈ స్కూటర్ ధర రూ.1.17 లక్షలు కాగా, క్యూసీ1 మాడల్ ధర రూ.90,022గా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌లో 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఈ స్కూటర్ల ధరల్లో ఇదే తక్కువ అయినప్పటికీ కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో హోండా స్కూటర్లతోపాటు బజాజ్, టీవీఎస్, ఏథర్, ఓలా, హీరో మోటోకార్ప్‌లు పలు మాడళ్లను విక్రయిస్తున్నాయి.