Honda Motor Cycle | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన సీబీ350, హెచ్’నెస్ సీబీ350 మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సర్, క్యామ్ షాఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్ల వాటిని రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హెచ్’నెస్ సీబీ 350, సీబీ350ఆర్ఎస్ మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నామని వెల్లడించింది.
వీటిలో వీల్ స్పీడ్ సెన్సర్ మౌల్డింగ్ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని, దీనివల్ల నీటిలో ప్రయాణించినప్పుడు స్పీడో మీటర్, ట్రాక్షన్ కంట్రోల్ లేదా ఏబీఎస్ ఇంటర్ వెన్షన్లో లోపం తలెత్తే అవకాశం ఉందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. పరిస్థితి దారుణంగా మారితే బ్రేకులు పని చేయకుండా పోయే పరిస్థితి నెలకొందని పేర్కొంది. క్యామ్ షాఫ్ట్ లో లోపం వల్ల సీబీ350, హెచ్’నెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు వివరించింది.
క్యామ్ షాఫ్ట్ తయారీలో లోపం వల్ల మోటారు సైకిళ్ల ఆప్టిమల్ ఫంక్షనింగ్‌లో తేడా వస్తున్నదని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలిపింది. గత జూన్, జూలైల్లో తయారైన మోటారు సైకిళ్లలోనూ లోపం తలెత్తిందని, ఆ లోపాలను సరి చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా బిగ్ వింగ్ డీలర్ షిప్‌ల వద్ద విడి భాగాలను ఉచితంగా రీప్లేస్ చేస్తామని వివరించింది.