Private Banks Attrition | అట్రిక్షన్లు అనే పదం ఇప్పటి వరకూ ఐటీ, టెక్నాలజీ కంపెనీల్లోనే ఉండేది. ఒక కంపెనీలో పని చేస్తున్న వృత్తి నిపుణుల్లో పలువురు మెరుగైన వేతన ప్యాకేజీ కోసం ఇతర కంపెనీల్లోకి బదిలీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి బ్యాంకులను తాకింది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగులు 25 శాతం అట్రిక్షన్లు కొనసాగుతున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల బ్యాంకుల నిర్వహణకు ముప్పు పొంచి ఉందని ‘2023-24లో భారతీయ బ్యాంకుల్లో ప్రగతి- ధోరణులు’ అనే అంశంపై ఆర్బీఐ నివేదిక పేర్కొంది. సెలెక్టెడ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్బీస్)ల్లో ఉద్యోగుల అట్రిక్షన్లు అధికంగా ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ అని వెల్లడించింది. కానీ, గత మూడేండ్లలో ప్రైవేట్ బ్యాంకుల్లో అట్రిక్షన్ రేటు దాదాపు 25 శాతం ఉందని వివరించింది.
ఉద్యోగుల అధిక అట్రిక్షన్ల వల్ల ఆయా బ్యాంకుల నిర్వహణకు ముప్పు ఏర్పడుతుందని ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ సర్వీసుల్లో అంతరాయం, లాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్, ఉద్యోగుల నియామక ఖర్చుల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ఉద్యోగుల అట్రిక్షన్లను తగ్గించాలని ఆయా బ్యాంకులతో జరిగిన చర్చల్లో వెల్లడించామని, తప్పనిసరి వ్యూహాలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు.
బంగారం, జ్యువెల్లరీలపై రుణాలు, టాపప్ రుణాల మంజూరులో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆర్బీఐ పేర్కొంది. బంగారం రుణాల మంజూరీ విధానాన్ని సమగ్రంగా సమీక్షించుకోవాలని, నిర్ధిష్ట కాల వ్యవధిలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. బంగారం రుణాల మంజూరు విషయంలో ఔట్ సోర్సింగ్ సేవలు, థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల వినియోగంపై తగినంత నియంత్రణ ఉండాలని సూచించింది.