Hero’s Karizma XMR 210 | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్.. భారత్ మార్కెట్లో ‘నెక్ట్స్ జనరేషన్ కరిజ్మా (Next Generation Karizma XMR 210)’ బైక్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 29న ఆవిష్కరిస్తామని తెలిపింది. ‘వన్ నేమ్. మిలియన్ ఎమోషన్స్. న్యూ కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ ఈ నెల 29న ఆవిష్కరిస్తాం. ఈ న్యూ మోటార్ సైకిల్.. బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్లతో పోటీ పడుతుంది` అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ఒక వీడియో షేర్ చేసింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సైతం హీరో కరిజ్మా బైక్ ఆవిష్కరణపై ‘ఎక్స్’లో పోస్ట్ షేర్ చేశారు. ‘మళ్లీ వస్తున్న కరిజ్మా కోసం మేమంతా వేచి చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ 210సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్న కరిజ్మా ఎక్స్ఎంఆర్ ఇంజిన్ గరిష్టంగా 25 బీహెచ్పీ విద్యుత్, 22 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ బైక్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షలు పలుకుతుందని అంచనా.
స్పోర్టీ స్టైల్‌తో వస్తున్న ఈ బైక్.. టాల్ వైండ్ స్క్రీన్, ఫెయిరింగ్ మౌంటెడ్ మిర్రర్స్, స్ప్లిట్ సీట్స్, ఎల్ఈడీ లైటింగ్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా జత చేస్తారని భావిస్తున్నారు.