Hero Motocorp | టూ వీలర్స్ జెయింట్ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిఘా ఉన్నట్లు సమాచారం. హీరో మోటో కార్ప్ యాజమాన్యం నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుపాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు ఆదాయం పన్ను విభాగం జరిపిన దర్యాప్తు ఆధారంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఒక థర్డ్ పార్టీ వెండర్తో కలిసి హీరో మోటో కార్ప్ నిధుల తరలించిందన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో హీరో మోటో కార్ప్ స్టాక్స్ పతనం అయ్యాయి.
హీరో మోటో కార్ప్ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి, నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ కంపెనీకి, హీరో మోటో కార్ప్ సంస్థతో గల సంబంధాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించినట్లు వినికిడి. కానీ, దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని హీరో మోటో కార్ప్ పేర్కొంది. తమతో దర్యాప్తు సంస్థలు సంప్రదిస్తే అందుకు అవసరమైన సమాచారం అందిస్తామని మాత్రం వెల్లడించింది.
హీరో మోటో కార్ప్ సంస్థపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ విచారణకు ఆదేశించిందన్న వార్తల ప్రభావం సంస్థ స్టాక్స్ మీద పడింది. గురువారం మధ్యాహ్నం అంతర్గత ట్రేడింగ్లో నాలుగు శాతం వరకు నష్టపోయింది. చివరకు ఎన్ఎస్ఈలో హీరో మోటో కార్ప్ స్టాక్ 2.99 శాతం నష్టంతో రూ.2842 వద్ద ముగిసింది. గతేడాది మార్చిలో పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హీరో మోటో కార్ప్ సంస్థ కార్యాలయాల్లో ఆదాయం పన్ను విభాగం అధికారులు తనిఖీలు చేశారు. సాధారణ విచారణలో భాగంగానే తమ సంస్థ కార్యాలయాలు, సంస్థ సీఈఓ పవన్ ముంజాల్ నివాసంలో ఈ తనిఖీలు చేశారని హీరో మోటో కార్ప్ వెల్లడించింది.