Hero MotoCorp | దేశంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp). స్టార్టప్ లు వచ్చిన తర్వాత మార్కెట్ వాటా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తన మార్కెట్ వాటాను కన్సాలిడేటెడ్ చేసుకోవాలని సంకల్పించింది. అందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక మోటారు సైకిళ్లు, స్కూటర్లు మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. తద్వారా ప్రీమియం బైక్ సెగ్మెంట్ మోటారు సైకిళ్ల విభాగంపై పట్టు బిగిస్తామని హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) సీఈఓ నిరంజన్ గుప్తా చెప్పారు. తొలుత హార్లీ డేవిడ్సన్ (Harley Davidson) భాగస్వామ్యంతో తొలి మోటారు సైకిల్ ఈ ఆర్థిక సంవత్సరమే దేశీయ మార్కెట్లోకి తెస్తామన్నారు.
ఇప్పుడు 100-110సీసీ బైక్ సెగ్మెంట్లోనే హీరో మోటో కార్ప్ సంస్థకు ప్రధాన వాటా ఉంది. ఇక నుంచి 125 సీసీ బైక్స్ సెగ్మెంట్ లో తన వాటా పెంచుకోవాలని, 160 సీసీ, అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల బైక్ ల తయారీతో లాభాలను పెంచుకోవాలని నిర్ణయించామన్నారు నిరంజన్ గుప్తా. ఈ లక్ష్య సాధన కోసం ప్రతి మూడు నెలలకోసారి కొత్త బైక్ లు మార్కెట్లోకి తెస్తామన్నారు. ప్రత్యేకించి ప్రీమియం సెగ్మెంట్ బైక్ లు చాలా మార్కెట్లో ఆవిష్కరిస్తామన్నారు.
150 సీసీ నుంచి 450 సీసీ మధ్యశ్రేణిపై కూడా దృష్టి సారించామన్నారు నిరంజన్ గుప్తా. ఇప్పటికే విదా (Vida) బ్రాండ్ పేరుతో ఈవీ సెగ్మెంట్ బైక్స్ విభాగంలోకి హీరో మోటో కార్ప్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 100 నగరాల పరిధిలో తమ విడా ఈవీ బైక్ ల విక్రయానికి ప్రణాళికలు వేగవంతం చేస్తున్నది. ఇప్పటికే దేశంలో తమ సంస్థకు గల నెట్ వర్క్ ఉపయోగించుకుంటామని తెలిపింది హీరో మోటో కార్ప్. ప్రస్తుతం మోటారు సైకిళ్ల మార్కెట్లో ఈ సంస్థకు దాదాపు 51 శాతం వాటా ఉంది. 125సీసీ సెగ్మెంట్లో డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే.. గత మార్చి నెలాఖరు నాటికి 14 శాతం నుంచి 22 శాతం మార్కెట్ వాటా పెంచుకున్నది.