ప్రస్తుత పాలసీల్లోనే కవరేజీ: ఐఆర్డీఏఐ
న్యూఢిల్లీ, జనవరి 3: కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్ బాధితులకు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఊరటనిచ్చింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ వైద్య ఖర్చులూ కవరేజీ అవుతాయని సోమవారం ప్రకటించింది. ‘జనరల్, ఆరోగ్య బీమా సంస్థలు జారీచేసే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్స వ్యయం కూడా ఉంటుంది. పాలసీ షరతులు, నిబంధనలకు లోబడి ఒమిక్రాన్ వైద్య ఖర్చులకూ బీమా వర్తిస్తుంది’ అని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒమిక్రాన్కూ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీల కవరేజీ ఉంటుందని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ మేరకు అన్ని జనరల్, ఆరోగ్య బీమా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఒమిక్రాన్ రోగులు ఇబ్బంది పడకుండా తమతమ నెట్వర్క్ల్లోని దవాఖానలకు ఈ సమాచారాన్ని వెంటనే పంపాలనీ సూచించింది. దేశంలో మొత్తం 1,700లకుపైగా ఒమిక్రాన్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
సీఈవో, డైరెక్టర్ల పారితోషికాలపై..
ప్రైవేట్ రంగ బీమా సంస్థల సీఈవోలు, ఎండీలు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హోల్-టైం డైరెక్టర్ల పారితోషికాలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. సీఈవో, ఎండీ, హోల్-టైం డైరెక్టర్ల పారితోషికాలను ఫిక్స్డ్ పే, పెర్క్స్, వేరియబుల్ పేగా విభజించాలన్నది. ఈ 19లోగా ఇండస్ట్రీ అభిప్రాయాలను కోరింది.
ష్యూరిటీ ఇన్సూరెన్స్ వ్యాపారంపై..
ష్యూరిటీ ఇన్సూరెన్స్ వ్యాపారం, ష్యూరిటీ బాండ్ల మార్కెట్ అభివృద్ధి కోసం ఐఆర్డీఏఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా విడుదల చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ష్యూరిటీ ఇన్సూరెన్స్ వ్యాపారం అంటే ఓ కాంట్రాక్టు. థర్డ్ పర్సన్ డిఫాైల్టెతే వారి బాధ్యతల స్వీకారానికి ఈ కాంట్రాక్టు ఉంటుంది. అడ్వాన్స్ పేమెంట్ బాండ్, బిడ్ బాండ్, కాంట్రాక్ట్ బాండ్లు, కస్టమ్స్ అండ్ కోర్టు బాండ్, పర్ఫార్మెన్స్ బాండ్లు, రిటెన్షన్ మనీ ఈ ష్యూరిటీ కాంట్రాక్టుల కిందికి వస్తాయి. ఇక ష్యూరిటీ బాండ్లు అనేవి లబ్ధిదారుల రక్షణార్థం ఉంటాయి.