జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సింగరేణిలో జాతీయ సంఘాల శకం ముగిసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. అబద్ధపు హామీలిచ్చి గుర్తింపు సంఘంగా గెలుపొందిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మికులను మోసం చేశాయని మండిపడ్డారు. జాతీయ సంఘాల మోసాలను గమనించిన కార్మికులు సింగరేణిలో ప్రస్తుతం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల విషయమై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, నవంబర్ లేదా డిసెంబర్లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి సింగరేణి సంస్థను అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు.
కల్లిబొల్లి మాటలు చెప్పి గుర్తింపు సంఘంగా గెలుపొందిన కామ్రేడ్స్‌ను సింగరేణి కార్మికులు ఛీ కొడుతున్నారని టీబీజీకేస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మికుల హకులను కాలరాశాయని మండిపడ్డారు.