హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో 41 బార్లు రానున్నాయి. క్యూర్ పరిధిలో 14 వరకు, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 27 వరకు 2బీ బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ. లక్ష రుసుముతో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. క్యూర్, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి పరిధిలోని 14 బార్లకు సంబంధించి అబారీ భవన్ కమిషనర్ కార్యాలయం, మలాజిగిరి డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎక్సైజ్‌శాఖ కల్పించింది.
మిగిలిన జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలతో పాటు కమిషనర్ కార్యాలయం, డీపీఈవో కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. దరఖాస్తులను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్‌శాఖ పేరొంది. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని అలియాబాద్‌లో ఒకటి, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో రెండేసి 2బీ బార్లకు సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, కుత్బుల్లాపూర్ డీపీఈవో కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తారు.
రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఫ్యూచర్ సిటీ, చేవెళ్ల మున్సిపాలిటీలో ఒకటి, మొయినాబాద్ మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు, వికారాబాద్ జిల్లా కొడంగల్, పరిగి మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, కోహిర్ మున్సిపాలిటీలో ఒకటి చొప్పున, గుమ్మడాల మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, కల్లూరు, మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర,
నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బిడ్డకుంట, వరంగల్ జిల్లాలో నర్సంపేట, జనగామ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మున్సిపాలిటీలో కొత్త 2బీ బార్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఎక్సైజ్‌శాఖ కల్పించింది. హైదరాబాద్ జిల్లాలోని 2బీ బార్లకు రూ. 44 లక్షలు, నిజామాబాద్ బోధన్ బార్‌కు రూ. 42 లక్షలు, మిగిలిన 2బీ బార్లకు రూ.30 లక్షలు ఏడాదికి ఎక్సైజ్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. వివరాలు tgbcl.telangana.gov.in వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.