న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: రోడ్డు దుస్థితిని తన ఫోన్లో రికార్డు చేసిన ఒక యువకుడిని ఢిల్లీ మంత్రి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చెంప చెళ్లుమనిపించడం ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తగా వేసిన రోడ్డు నాణ్యతపై ఆదివారం మంత్రి, ఆప్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తిలక్‌నగర్‌లో నిర్మాణంలో ఒక రోడ్డును పరిశీలించడానికి మంత్రి వర్మ వచ్చారు. అదే సమయంలో స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కూడా అక్కడికి వచ్చారు.
ప్రమాణాల ప్రకారం కాకుండా నాసిరకంగా రోడ్డును నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. వర్మతో ఉన్న వ్యక్తులు అప్పుడు వేసిన రోడ్డును చేతితో పెకిలించి ఇదేనా నాణ్యత? అని ప్రశ్నించగా, మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డు దుస్థితిని, నాయకుల వాగ్వాదాన్ని స్థానిక యువకుడొకరు వీడియో తీయడాన్ని గమనించిన మంత్రి అతడిని చెంపదెబ్బ కొట్టారు. దీనిపై ఆప్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం వేస్తున్న నాసిరకం రోడ్ల నిర్మాణం గురించి ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతోనే మంత్రి పోలీసుల అండతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు. ‘పోలీసులు, భద్రతా సిబ్బంది లేకుండా ఆ కుర్రాడితో తలపడండి చూద్దాం?’ అని ఆయన మంత్రికి సవాల్ విసిరారు.