Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి గల వయో పరిమితి నిబంధనను తొలగిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం.. ఇక నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అన్ని వయస్సుల వారికి ఇన్సూరెన్స్ సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేయొచ్చు. ఇంతకు ముందు గరిష్టంగా 65 ఏండ్ల వరకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు అనుమతించే వారు.
ఐఆర్డీఏఐ తీసుకున్న నిర్ణయంతో మరింత మందికి హెల్త్ కేర్ కల్పించొచ్చు. వివిధ బీమా కంపెనీలు తమ ఇన్సూరెన్స్ పాలసీలను విభజించుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పాలసీలు తేవాలని, వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చానెల్ ఏర్పాటు చేయాలని ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది. తాజాగా ఐఆర్డీఏఐ తీసుకున్న నిర్ణయాన్ని బీమా రంగ పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.
అన్ని వయస్సుల వారికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల జారీతోపాటు ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్లను ఐఆర్డీఏఐ కుదించేసింది. నాలుగేండ్ల వెయింటింగ్ పీరియడ్‌ను మూడేండ్లకు కుదించింది. దీనివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారు వరుసగా మూడేండ్లు ప్రీమియం చెల్లిస్తే, ముందస్తు వ్యాధుల సాకుగా వారి క్లయిమ్‌లను ఇన్సూరెన్స్ సంస్థలు తిరస్కరించే వీలు ఉండదు. మారటోరియం గడువును ఎనిమిదేండ్ల నుంచి ఐదేండ్లకు తగ్గించేసింది.