Ramoji Rao |హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : వ్యాపార రంగానికి ఆయనొక మార్గదర్శి. ఏ పనైనా దూరదృష్టితో ప్రణాళికవేస్తే విజయం సాధిస్తామన్న ధీమా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు పుట్టుకతోనే వచ్చింది. తాను మొదలు పెట్టే ఏ కార్యక్రమమైనా తాత్కాలికంగా కాకుండా.. దీర్ఘకాలికంగా నిలువాలనే ఉద్దేశంతో అడుగులు వేశారు. కృషి, పట్టుదలతో విజయవంతంగా ముగించాలని భావిస్తుంటారు కాబట్టే ఆయన చేపట్టినదేదైనా బంగారమైంది. శూన్యం నుంచి చరిత్రను లిఖించగలిగిన వ్యక్తిగా ఎదిగారంటే కారణం ఆయన క్రమశిక్షణే. అందుకే ఆయనొక వ్యాపార మార్గదర్శిగా నిలిచారు.
గుడివాడలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత తొలి ఉద్యోగం దేశ రాజధాని ఢిల్లీలో చేశారు. ‘అనంత్’ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు. అక్కడ తన డెడికేషన్ చూసి ఆ యజమాని ఉప్పొంగిపోయేవారు. అప్పుడే గొప్ప విజయాలు సాధించవచ్చన్న ఆత్మవిశ్వాసం ఆయనలో పెరిగింది. వచ్చిన అమెరికా అవకాశాన్ని కుటుంబం కోసం వదులుకొని.. 1962 అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. చిట్టీల వ్యాపారమంటే గృహిణుల వ్యవహారమన్న రోజుల్లోనే మార్గదర్శిని ఓ మార్గదర్శకంగా తీర్చిదిద్దారు. వసూళ్లు, చెల్లింపులు కచ్చితంగా ఉండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత కారణంగా సంస్థ వేగంగా అభివృద్ధి చెందింది.
సాగర తీర సుందర పట్టణం విశాఖలో డాల్ఫిన్ హోటల్‌ను 1980లో ప్రారంభించారు. విశాఖ పెద్ద పర్యాటక నగరంగా అభివృద్ధి చెందుతుందని ముందస్తు అంచనాతో ఆయన.. త్రీస్టార్ హోటల్‌గా దీనిని ప్రారంభించారు. ఇదే క్రమంలో ఆతిథ్య రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రామోజీ ఫిల్మ్ సిటీలోనే తార, సితార స్టార్ హోటళ్లను నిర్మించారు. సహారా, శాంతినికేతన్లు దీని ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.
తెలుగువారి వంటింటి రుచుల్ని ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో రామోజీరావు 1980లో ప్రియా పచ్చళ్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పోరంకి గ్రామంలో ఆరు రకాల ఊరగాయలతో ప్రారంభమైన ఈ వ్యాపారం ప్రస్తుతం 205 రకాల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నది.
హస్తకళలు, వస్త్ర సోయగాలకు వేదికగా నిలిపేందుకు ఆయన కళాంజలిని 1992లో ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసే చేతివృత్తి కళాకారులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌లో ప్రారంభమై… విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రముఖ నగరాలకు షోరూంలను విస్తరించారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, కేరళతోపాటు దేశవ్యాప్తంగా విస్తరించారు.
హైదరాబాద్ వేదికగా 1996లో రామోజీ ఫిలిం సిటీ ఆరంభమైంది. సాధారణ చిన్న సినిమాలతోపాటు, హాలీవుడ్ చిత్రాలు సైతం ఈ ఫిలిం సిటీలో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. బిగ్గెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ సెంటర్‌గా ఈ ఫిలిం సిటీని గిన్నిస్ రికార్డు సైతం వరించింది.