న్యూఢిల్లీ, జూలై 29: హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో 4.95 శాతం వృద్ధిచెంది రూ.5,574 కోట్లకు పెరిగింది. స్టాండలోన్ ప్రాతిపదికన 22 శాతం పెరుగుదలతో రూ.3,669 కోట్లకు చేరింది. స్టాండలోన్ ఆదాయం రూ.11,663 కోట్ల నుంచి రూ.13,249 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.4,447 కోట్ల వద్ద నిలిచింది. వడ్డీరేట్ల పెరుగుదల కారణంగా కీలకమైన వడ్డీ ఆదాయం తగ్గడంతో మొత్తంగా నికర లాభం వృద్ధి పరిమితమైంది. ఇక మిగిలిన ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తున్నది. తమ మొత్తం రుణాల్లో 79 శాతం వ్యక్తిగత రుణాలని, స్థూల ఎన్పీఏలు 1.78 శాతానికి మెరుగుపడ్డాయన్నది.
1.1 బిలియన్ డాలర్ల సమీకరణ
విదేశీ వాణిజ్య రుణాల ద్వారా 1.1 బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించిందని, ఈ నిధుల్ని అఫర్డ్‌బుల్ హౌసింగ్ విభాగంలో రుణాలిచ్చేందుకు ఉపయోగిస్తామని హెచ్డీఎఫ్సీ సీఈవో మిస్త్రీ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో హెచ్డీఎఫ్సీ విలీనం జరిగే సమయం దగ్గరపడుతున్నందున, స్వల్ప, మధ్యకాలిక రుణ సాధనాల్ని తగ్గించి, దీర్ఘకాలిక రుణ సమీకరణ పత్రాలపై దృష్టిపెడుతున్నామని ఈ సందర్భంగా అన్నారు.