Home Loans | ఇండ్ల రుణాలపై హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) వడ్డీరేట్లు పెంచేసింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) రేట్లు 25 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన వడ్డీరేట్లు మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం వడ్డీరేట్లు సవరిస్తామని పేర్కొంది. ఒకవేళ మీ ఇళ్ల రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే నెలవారీ ఈఎంఐలు కూడా పెరుగుతాయి.
అయితే, క్రెడిట్ స్కోర్, ఇతర రుణాల చెల్లింపులు, తదితర అంశాల ఆధారంగా కస్టమర్లకు రుణ పరపతి కల్పించాలని నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది. సిబిల్ స్కోర్ 760 పాయింట్లకు పైగా ఉంటే 8.70 శాతం వడ్డీరేటుపై స్పెషల్ ఆఫర్‌తో రుణాలిస్తామని తెలిపింది. ఈ స్పెషలాఫర్ మార్చి నెలాఖరు వరకు ఉంటుంది. గత డిసెంబర్లో ఇండ్ల రుణాలపై హెచ్డీఎఫ్సీ రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 35 బేసిక్ పాయింట్లు పెంచేసింది. అధిక ధరలను నియంత్రించడానికి గతేడాది మే నుంచి ఆర్బీఐ, ఆరు దఫాలు రెపోరేట్ పెంచింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 250 బేసిక్ పాయింట్లు అదనంగా పెరిగింది.
రుణ గ్రహీతలకు మూడు ఇన్స్టాల్ మెంట్లలో ఇండ్ల రుణాలు పంపిణీ చేస్తామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఇల్లు నిర్మాణంలో ఉంటే దాని ప్రగతికి అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. రుణ గ్రహీతల వయస్సు, విద్యార్హతలు, వారిపై ఆధారపడి ఉన్న డిపెండెంట్లు, రుణ గ్రహీత జీవిత భాగస్వామి ఆదాయం, ఆస్తులు, రుణాలు, సేవింగ్స్ హిస్టరీ తదితర అంశాల ఆధారంగా రుణం మంజూరుకు అర్హులవుతారు.