HDFC Twins Merger | దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) విలీనం కానున్నది. జూలై ఒకటో తేదీ నుంచి అంటే శనివారం నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ బ్యాంకుల సరసన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చేరింది. హెచ్డీఎఫ్సీ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.14.09 లక్షల కోట్లు అని బ్లూంబర్గ్ ఇండెక్స్ అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సుమారు 12 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. బ్యాంకు శాఖల నెట్ వర్క్ 8,300 పై చిలుకు నమోదవుతుండగా, పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1.77 లక్షలు దాటనున్నది.
హెచ్డీఎఫ్సీ విలీనంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన బ్యాంకుల సరసన నాలుగో స్థానంలో నిలుస్తుంది హెచ్డీఎఫ్సీ బ్యాంకు. జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, ఇండస్ట్రీయల్ అండ్ కామర్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ తర్వాతీ స్థానం హెచ్డీఎఫ్సీ బ్యాంకుదే. జూన్ 22 నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ 171.7 బిలియన్ డాలర్లు ఉంటుందని బ్లూంబర్గ్ అంచనా వేసింది.
హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గా ‘హెచ్డీఎఫ్సీ’ ఇండ్లు, దుకాణ సముదాయాలు, ఆస్తుల కొనుగోళ్లకు రుణాలు సమకూరుస్తుంది. అంతే కాదు హెచ్డీఎఫ్సీ బ్యాంకు మాదిరిగానే అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లతోపాటు వివిధ ఖాతాలను తెరుస్తుంది. అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తుంది. ఈ రెండు సంస్థల విలీనంతో ఇండ్ల రుణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, నూతన తరం ఫిన్‌టెక్ కంపెనీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం అవసరం ఏర్పడిందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండింటి విలీనంతో బ్యాలెన్స్ షీట్‌తోపాటు పోటీ తత్వం కూడా పెరుగుతుంది. రుణాల పోర్ట్ ఫోలియో బలోపేతం అవుతుంది. తన ఉత్పత్తులను కొత్త వ్యక్తుల దరికి చేర్చనున్నది.
జేపీ మోర్గాన్ చేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ – 419.14 బిలియన్ డాలర్లు
ఇండస్ట్రీయల్ అండ్ కామర్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఎం-క్యాప్ – 226.38 బిలియన్ డాలర్లు
బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఎం-క్యాప్ – 228.40 బిలియన్ డాలర్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ – 171.7 బిలియన్ డాలర్లు