న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,736 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,373 కోట్ల లాభంతో పోలిస్తే 2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.81,720 కోట్ల నుంచి రూ.87,460 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది.
కోలుకున్న సూచీలు
ముంబై, జనవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ట్రంప్ దెబ్బకు మంగళవారం భారీగా నష్టపోయిన సూచీలు ఆ మరుసటి రోజు ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అండతో తిరిగి లాభాల్లోకి వచ్చాయి. చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ మళ్లీ 76 వేల పైకి చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 567 పాయింట్లు అందుకొని 76,404. 99 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 130. 70 పాయింట్లు ఎగబాకి 23,155.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. తీవ్ర హెచ్చుతగ్గుదల మధ్య కొనసాగిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో చివరి గంటలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.