HDFC Bank | దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం నికర లాభాల్లో 30 శాతం గ్రోత్ నమోదు చేసింది. మార్కెట్ వర్గాలు రూ.11 వేల కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేయగా, జూన్ త్రైమాసికంలో 11,952 కోట్ల నికర లాభం పొందింది. వివిధ మార్గాల్లో ఆదాయం 39 శాతం పెరిగి రూ.57,817 కోట్లకు చేరుకున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు విడుదల చేసిన తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ఇవి. నికర వడ్డీ ఆదాయంలో 21 శాతానికి పైగా గ్రోత్తో రూ.23,599 కోట్ల ఆదాయం సంపాదించింది. నిర్వహణ లాభాలు 22 శాతం పెరిగి రూ.18,722 కోట్లకు చేరుకున్నాయి.
జూన్ త్రైమాసికం ముగిసేనాటికి మొత్తం బ్యాంకు రుణాల్లో స్థూల మొండి బకాయిలు 1.28 శాతం నుంచి 1.12 శాతానికి పడిపోయాయి. నికర మొండి బకాయిలు గతేడాది జూన్ త్రైమాసికంలో 0.35 శాతముంటే గత జూన్ త్రైమాసికంలో 0.30 శాతం మాత్రమే. మార్చి త్రైమాసికంతో పోలిస్తే 0.27 శాతం ఎక్కువ. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు 19 శాతం పెరిగి రూ.19.13 లక్షల కోట్లకు పెరిగాయి. కరంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు దాదాపు 11 శాతం పెరిగాయి.