HDFC Bank Loans Costly | ఆర్బీఐ తన ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. కానీ దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్’ వివిధ రుణాలపై బేస్ రేట్, ఇంటరెస్ట్ రేట్ పెంచేసింది. బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) పది బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీ నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. దీంతో ఇండ్ల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఆటో రుణాలపై ఈఎంఐలు భారం కానున్నాయి. బేస్ రేట్ ఐదు బేసిక్ పాయింట్లు, బెంచ్ మార్క్ పీఎల్ఆర్ 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. 2023 సెప్టెంబర్ 25 నుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 8.55 నుంచి 9.25 శాతం మధ్య పెరుగుతాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెరిగి 8.50 నుంచి 8.60 శాతానికి, నెల గడువు గల రుణాలపై 8.65, మూడు నెలల గడువు గల రుణాలపై ఐదు బేసిక్ పాయింట్లతో 8.85 శాతానికి, ఆరు నెలల టెన్యూర్ రుణాలపై 9.10 శాతానికి, ఏడాది టెన్యూర్ రుణాలపై 9.15 నుంచి 9.20 శాతానికి పెంచారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేట్ 9.20 నుంచి 9.25 శాతానికి పెంచారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి పెంచిన బేస్ రేట్ అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు జూన్ 16న బేస్ రేట్ 9.20 శాతానికి పెంచింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. బెంచ్ మార్క్ పీఎల్ఆర్.. గత జూన్ 16న 17.70 శాతం కాగా, తాజా సవరణతో 17.85 శాతానికి పెరిగింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. వివిధ రుణాలపై తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్) పెంచేశాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి.