పతనం. అధఃపాతాళానికి పతనం. ఇంకా లోలోతుల్లోకి పతనం. కాంగ్రెస్‌కు బాగా అలవాటైన క్రీడా పతనమే. తన గొయ్యిని తానే తవ్వుకునే అతితెలివి ఆ పార్టీకి మాత్రమే సొంతం. న్యాయవ్యవస్థ అనే ఉక్కుస్తంభమే లేకపోతే కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనేది ఆ పార్టీ సిద్ధాంతం. తాను చెప్పిన నీతుల్ని తానే ఆరు నిలువుల లోతుల్లో పాతరేయడం ఆ పార్టీ విధానం. ఆనాడు రాజీవ్ గాంధీ తన బండ మెజారిటీ ఎక్కడ చిందరవందర అయిపోతుందోననే బెంగతో తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టానికి అతని సుపుత్రుడు రాహుల్ గాంధీ తూట్లు పొడవటం చారిత్రక విరోధాభాస. ప్రజాస్వామ్య రసాభాస.
ఈ వికృత క్రీడకు హైకోర్టు అడ్డుకట్ట వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఆడిన ఆయారామ్ గయారామ్ ఆటకు ఈ తీర్పు చెంపపెట్టు. ఖైరతాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు దీనికి తొలిమెట్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే, కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా ఆ పార్టీ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేయడం రాజకీయ అనైతికతకు పరాకాష్ట. దీనిపై హైకోర్టు స్పందన కూడా తీవ్రంగానే ఉన్నది. దానం శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడం మాత్రమే కాకుండా, ఎంపీ పదవికి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అనర్హత అమలవుతుందని న్యాయస్థానం స్పష్టపరచడం ముదావహం. దానంను బరి నుంచి బయటకు పంపడంతో బీఆర్ఎస్ ఫిరాయింపుదారుల్లో తొలి వికెట్ పడిపోయింది. మిగిలిన మరో తొమ్మిదిమందిపై అనర్హత వేటు పడాల్సి ఉన్నది.
దానం ఎన్నికల వ్యవస్థలో నామినేషన్ అనే ప్రక్రియ వల్ల ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. అయితే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఉన్నవారికి సంబంధించి బయటి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేమని కూడా కోర్టు పేర్కొన్నది. పార్టీ మారినవారు కండువాలు కప్పుకొని బాహాటంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ సభాపతి ఆ విషయం గుర్తించ నిరాకరించడం సహజంగానే చర్చనీయాంశమైంది. స్పీకర్ పూర్వాశ్రమంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది అప్రస్తుతం. ఒకసారి ఆ పదవి చేపట్టాక అన్నిపక్షాలనూ సమదృష్టితో చూడటం, సభను నిష్పాక్షికంగా నడుపడం తప్పనిసరి. సభలో స్పీకర్ సర్వాధికారే. కానీ ఫిరాయింపుదారుల అనర్హత విషయంలో ఆయన రాగద్వేషాలకు అతీతమైన న్యాయాధికారిలా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే స్పీకర్ నిర్ణయం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. ఆ తీర్పు వెలుగులోనే విచారణ సాగించిన హైకోర్టు ఇప్పుడు ఆ నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చింది.
ఈ మొత్తం వ్యవహారం వల్ల శాసనవ్యవస్థలో అత్యున్నత స్థానమైన స్పీకర్ పదవి గౌరవం మసకబారడం బాధాకరం. నిష్పాక్షికతకు నిలువెత్తు రూపంగా ఉండాల్సిన సభాపతి ఓ వైపు మొగ్గు చూపారా? అనే భావన కలగడం ఆ పదవి పాలకపక్షం వైపు మొగ్గినట్టుగా కనిపించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ‘పార్టీ మారినా ఉపఎన్నికలు రావు’ అంటూ ముఖ్యనేత నిండుసభలోనే ఫిరాయింపుదారులకు భరోసా ఇవ్వడం, దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం తెలిసిందే. దాంతో ఆయన లెంపలేసుకుని క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద దానం కేసులో హైకోర్టు తీర్పు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఇక్కడ కొందరు వ్యక్తులు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం ముఖ్యమైన విషయం కాదు. రాజకీయ ప్రలోభాల కారణంగా ప్రజాస్వామిక వ్యవస్థలు అపహాస్యం కావడం అసలు సమస్య.