HDFC | ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్‌ను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం అదే బాటలో నడుస్తున్నది. కొత్తగా తీయనున్న సేవింగ్ అకౌంట్ల కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు ఒకటి నుంచి తెరిచిన ఖాతాలకు ఈ రూల్ వస్తుందని పేర్కొంది. బ్యాంక్ నిర్ణయం నేపథ్యంలో ఆగస్టు ఒకటి తర్వాత సేవింగ్ అకౌంట్ తెరిచిన ఖాతాదారులందరూ తప్పనిసరిగా నెలవారీ మినిమమ్ బ్యాలెన్స్‌ను రూ.25వేలు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాతాలో తక్కువగా ఉంటే.. జరిమానా విధించనున్నది.
గతంలో బ్యాంకు కనీస మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి రూ.10వేలుగా ఉండేది. ఈ కొత్త నిబంధనలను అన్ని ప్రధాన మెట్రో నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తున్నది. గతంలో తీసిన ఖాతాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ఇంతకు ముందు ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెనక్కి తగ్గింది. పరిమితిని రూ.15వేలకు తగ్గించింది.
మరో వైపు తక్షణ చెల్లింపు సర్వీస్ (IMPS) ద్వారా ఆన్లైన్లో రూ. 25వేల కంటే ఎక్కువగా డబ్బులు బదిలీ చేస్తే ఫీజులు వసూలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి ఈ నిబంధన అమలులోకి రానున్నది. ప్రస్తుతం రూ.25వేల నుంచి రూ.లక్షల వరకు పంపితే రూ.2 వసూలు చేస్తుండగా.. రూ.2లక్షల వరకు పంపితే రూ.6.. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.10(జీఎస్టీ అదనం)గా వసూలు చేస్తున్నది.