న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: అదానీ గ్రూప్ దూకుడు తగ్గిందా?.. విలీనాలు-కొనుగోళ్లకు గౌతమ్ ఆదానీ ఆసక్తి చూపట్లేదా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. కనిపించిన ప్రతీ కంపెనీని చేజిక్కించుకుంటూ అన్ని రంగాల్లో విస్తరించిన అదానీ.. ఇప్పుడు అవకాశం ఉన్నప్పటికీ అక్కర్లేదంటున్నారు. అదికూడా ప్రభుత్వ రంగ సంస్థలో మరి. ఎలక్ట్రిసిటీ ట్రేడర్ పీటీసీ (పవర్ ట్రేడింగ్ కార్ప్) ఇండియా లిమిటెడ్‌లో వాటా కొనుగోలుకు వెళ్లకూడదని గౌతమ్ అదానీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే బిడ్డింగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అదానీ గ్రూప్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో నగదు నిల్వల పెంపునకు అదానీ గ్రూప్ ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. అందుకే వెనక్కి తగ్గుతున్నదని అంటున్నారు. నిజానికి పీటీసీ వాటాను దక్కించుకునే అవకాశమున్న వారిలో అదానీ కూడా ఒకరని జనవరిలో బ్లూంబర్గ్ న్యూస్ అంచనా వేసింది. మరోవైపు ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు నిరాకరించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ లిమిటెడ్, ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు పీటీసీలోని తమ వాటాల్లో 4 శాతం చొప్పున మొత్తం 16 శాతం వాటాను అమ్మేయాలని చూస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న పీటీసీ ఇండియా లిమిటెడ్ షేర్ విలువ ప్రకారం.. ఈ 16 శాతం వాటా విలువ దాదాపు 52 మిలియన్ డాలర్లుగా ఉంటున్నది. ఈ లెక్కన ఈ పవర్ ట్రేడర్ మార్కెట్ విలువ సుమారు 322 మిలియన్ డాలర్లని అంచనా. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా పీటీసీ షేర్ విలువ దాదాపు 11 శాతం ఎగబాకడం విశేషం. అయినప్పటికీ పీటీసీలో వాటాను కొనడానికి అదానీ విముఖత చూపుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. 1999లో పీటీసీని స్థాపించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో మొదలైన ఈ సంస్థ.. 2001 నుంచి ఎనర్జీ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు దేశీయ పవర్ ట్రేడింగ్ మార్కెట్లో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. దేశ, విదేశాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి.
హిండెన్‌బర్గ్ రిసెర్చ్ దెబ్బకు అదానీ కంపెనీల షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో కుప్పకూలినది విదితమే. గత నెల 24న అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్‌బర్గ్ ఓ రిపోర్టునిచ్చినది తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా అదానీ గ్రూప్‌లోని 10 సంస్థల మార్కెట్ విలువ 130 బిలియన్ డాలర్లపైనే కరిగిపోయింది. ఇన్వెస్టర్లు ఎడాపెడా అదానీ షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో మదుపరులలో మళ్లీ విశ్వాసాన్ని పెంచుకోవడంపైనే గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రధానంగా దృష్టిపెట్టారని అంటున్నారు. అందుకే ఇప్పట్లో కొత్త సంస్థల జోలికి వెళ్లరాదని నిశ్చయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త పెట్టుబడులను పక్కనబెట్టి, సంస్థాగతంగా బలపడాలని చూస్తున్నది. అప్పులను తీర్చి మార్కెట్లో పరపతిని పెంచుకోవాలనీ భావిస్తున్నది.
అదానీ గ్రూపునకు మరిన్ని రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు దేశీయ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రకటించింది. పూచికత్తు ప్రమాణాలకు లోబడి అదానీ గ్రూపు నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వనున్నట్లు బీవోబీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా తెలిపారు. అదానీ స్టాక్స్ పతనంపై ఎలాంటి ఆందోళన లేదని, గ్రూపు నిర్వహిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో 500 మిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లింపులు జరిగేందుకు సిద్ధమవుతున్న అదానీ గ్రూపునకు ఇది శుభవార్త లాంటిది. అదానీ గ్రూపునకు ఇప్పటి వరకు ఎంత మేర రుణాలు ఇచ్చిన విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించడానికి నిరాకరించారు. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.27 వేల కోట్లు రుణం ఇచ్చిన విషయం తెలిసిందే.