GST Reforms | కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను రెండింటికి కుదిరించింది. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయంతో పలు కార్లపై జీఎస్టీ తగ్గింది. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చాక భారీగా ధరలు తగ్గనున్నాయని భావిస్తూ.. కార్లను కొనుగోలు చేయడం వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను సైతం రద్దు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ 2.0 అమలు తర్వాత కార్ల ధరలు తగ్గుతాయని.. దాంతో తక్కువ రుణం సరిపోతుందని కార్ల కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు అప్రూవ్ చేసిన కారు రుణాలను రద్దు చేసుకునేందుకు ఆయా బ్యాంకు బ్రాంచ్‌లను ఆశ్రయిస్తున్నారని ఓ ప్రభుత్వ బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలతో పోలిస్తే.. బ్యాంకుల రుణాలను రద్దు చేసుకునే ఫీజు చాలా తక్కువగా ఉందని.. దాంతో కొత్త రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
మరో వైపు వర్షాకాలంలో వినియోగదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు ఆటో, గృహరుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. అయినా కార్ల కొనుగోలుదారులు తమకు మంజూరు చేసిన రుణాలను రద్దు చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో బ్యాంకులు ఆందోళనకు గురవుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో 1200 సీసీ వరకు కార్లపై పన్ను రేటును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. ఇదిలా ఉండగా.. డీలర్ కస్టమర్‌కు ఇన్వాయిస్ జారీ చేస్తే కారు కొనుగోలుపై పాత జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇన్వాయిస్ జారీ చేయకపోతేనే కొత్త రేటు ప్రయోజనాలు పొందవచ్చన్నారు. జీఎస్టీ సంస్కరణల అమలుతో ఆటోమొబైల్ కంపెనీల ఖాతాల్లో జమ చేసిన రూ.2500 పరిహార సెస్ ముగియనున్నది. ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం, ఆదాయపు పన్ను మినహాయింపు కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ రూ.3.50లక్షల కోట్లకు పెంచుతుందని అంచనా. సంస్కరణల ద్వారా 7 నుంచి 7.50శాతం వృద్ధి రేటు సాధించడం సాధ్యమవుతుందని.. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలను సృష్టి వేగాన్ని మరింత వేగంతం చేసేందుకు తయారీ రంగంపై దృష్టిసారించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
ఇందుకు ఇతర రంగాల్లోనూ సంస్కరణలు కీలకమని.. ముఖ్యంగా కార్మిక రంగంలో అవసరమని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ఎన్ఆర్ భానుమూర్తి పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల గుణకం ప్రతికూలంగా ఉంటుందని.. అంటే పన్ను ఎంత ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అంత తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిలో సంస్కరణలు పన్నుల భారాన్ని తగ్గిస్తాయని.. ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని 7 నుంచి 7.5శాతం వరకు పెంచుతుందన్నారు. వినియోగదారుల ట్రెండ్‌ని పరిగణలోకి తీసుకుంటే మొత్తం డిమాండ్ రూ.2.30లక్షల కోట్లకు పెరుగుతుందని.. జీఎస్టీ రేట్ల తగ్గింపు గుణక ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే డిమాండ్ రూ.1.20లక్షల కోట్లు పెరుగుతుందని.. దాంతో ఆర్థిక వ్యవస్థంలోకి రూ.3.50లక్షల కోట్లు వస్తాయని ఆనంద్ రతి గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజన్ హజ్రా పేర్కొన్నారు. వినియోగం పెరుగడంతో కంపెనీల లాభాలు పెరుగుతాయని.. కంపెనీల అమ్మకాల పరిమాణంతో పాటు నికర లాభం సైతం పెరుగుతుందని ఆయన వివరించారు.