GST Council | హైదరాబాద్, జూలై15 (నమస్తే తెలంగాణ): చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరాత్ వ్యాపారులు అడిగిందే తడువుగా అభయమిచ్చింది. జరీపై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. దీనిపై చేనేత సంఘాలు మండిపడుతున్నాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్న 90 శాతం జరీ ఉత్పత్తులు ఒక సూరత్ పట్టణంలోనే తయారవుతుండటమే ఇందుకు కారణం. 2017లో జీఎస్టీ పన్నుల విధానం అమలులోకి వచ్చినప్పుడు రియల్, ఇమిటేషన్ జరీలపై 12 శాతంగా జీఎస్టీ పన్నును వేయాలని నిర్ణయించారు. సూరత్‌కు చెందిన వ్యాపారులు, స్థానిక నాయకత్వం, గుజరాత్ ప్రజా ప్రతినిధులు రియల్ జరీ పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించుకున్నారు..మళ్లీ ఇప్పుడు అదే సూరత్ వ్యాపారులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇమిటేషన్ జరీపై ఉన్న 12 శాతం జీఎస్టీని కూడా 5 శాతానికి తగ్గించుకున్నారు. మిల్లులపై ఉత్పత్తి చేసే బట్టలపై విధించే పన్నులు, చేనేత మగ్గంపై తయారు చేసే బట్టలపై విధిస్తున్న పన్నులు ఒకే స్లాబ్ కింద ఉండకూడదని దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులు మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు. పవర్‌లూమ్స్‌తో హ్యాండ్లూమ్ పోటీ పడలేదని తెలిసి కూడా కేంద్రం ఆ రెండింటినీ ఒకే గాటన కట్టడంపై మండిపడుతున్నారు.
ఏండ్లుగా పోరాడుతున్నా..
కేంద్రంలోని బీజేపీ సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి 5 శాతం జీఎస్టీని చేనేతపై విధించింది. నాటి నుంచి జీఎస్టీ తొలగించాలని చేనేత కార్మికులు, సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లక్ష ఉత్తరాలు పంపించారు. గత ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా జీరో జీఎస్టీ ఉద్యమాన్ని చేపట్టారు. చేనేత పై జీఎస్టీ పన్ను తొలగించాలని దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేనేత మహా వస్త్ర లేఖ”పై సంతకాలు కూడా చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాలు, 15 రాజకీయా పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయినప్పటికీ కేంద్రసర్కారు మాత్రం చలించడం లేదు.
కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న కేంద్రం: ఎర్రమాద వెంకన్న
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆది నుంచీ కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న మండిపడ్డారు. జీఎస్టీని తొలగించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం, కేవలం గుజరాత్ జరీ పరిశ్రమ రక్షణ కోసం మాత్రం జీఎస్టీని 7శాతానికి తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్రం తన విధానాలు మార్చుకోవాలని, లేదంటే మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు7న ఢిల్లీలో ఉదయం8 గంటలకు ఎర్రకోట నుంచి రాజ్‌ఘాట్ వరకు నిర్వహించతలపెట్టిన హ్యాండ్లూమ్ మార్చ్‌కు చేనేత కార్మికులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.