GST | న్యూఢిల్లీ, మార్చి 13 : బీమా ప్రీమియం చెల్లింపుదారులకు త్వరలో ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీమా ప్రీమి యం వసూళ్లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించే విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ సూచనలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మే, జూన్ నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంకాబోతున్నది. ప్రస్తుతం హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
దీనిని తగ్గించాలనే ప్రతిపాదనపై గత కొన్నేండ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా కొలిక్కిరాలేదు. ఈ సారి కొలిక్కిరానున్నట్లు, ఎంతమేర తగ్గించేదానిపై చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వవర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ప్రీమి యం వసూళ్లపై జీఎస్టీని సున్నా లేదా 5 శాతం లేదా 12 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. కానీ, ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీమా రంగ ప్రతినిధులు కలుసుకొని 12 శాతం విధించాలని సూచించారంట. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా 5 శాతం విధించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఐఆర్డీఏఐ..బీమా రంగ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నది. త్వరలో జీఎస్టీ కౌన్సిల్‌కు ఒక నివేదికను సమర్పించనున్నది.