GST Collections | అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు నెలకొల్పాయి . దేశీయ విక్రయాలు పుంజుకోవడంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు తొమ్మిది శాతం వృద్ధి చెంది రూ.1.87 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇది రెండో గరిష్టం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ నెల ఏప్రిల్లో రూ.2.10 లక్షల కోట్లు వసూలు కావడమే గరిష్టం.
ఇక గత నెల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.33,821 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.41,864 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.99,111 కోట్లు, సెస్ రూ.12,550 కోట్లు వసూళ్లయ్యాయి. గత నెలలో జీఎస్టీ వసూళ్లు 8.9 శాతం పెరిగి రూ.1,87,346 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో రూ.17.2 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ వసూళ్లు 10.6 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి ద్వారా రూ.45,096 కోట్లు వసూలయ్యాయి. 2023-24తో పోలిస్తే గత నెలలో రీఫండ్స్ 18.2 శాతం పెరిగి రూ.19,306 కోట్లకు చేరాయి. రీఫండ్స్ సర్దుబాట్లతో నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి.