GST Medicine | వస్తుల సేవల పన్ను (GST) వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 5శాతం, 18శాతం అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. దాంతో పాటు విలాసవంతమైన వస్తువులకు 40శాతం ప్రత్యేక శ్లాబ్ నిర్ణయించారు. జీఎస్టీ సంస్కరణల్లో కీలక మార్పుల్లో మెడిసిన్స్ సైతం ఉన్నారు. మందులపై జీఎస్టీని తగ్గించింది. 33 మందులపై జీఎస్టీని 12శాతం నుంచి సున్నాకు తగ్గిస్తూ నిర్ణయించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స ఉపయోగించే మందులను జీఎస్టీని 5శాతం నుంచి సున్నాకి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. ప్రాణాలను కాపాడే, క్యాన్సర్ మందులను జీఎస్టీ నుంచి మినహాయించాలన్న ప్రభుత్వం నిర్ణయం రోగులకు, వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించనున్నదని నిపుణులు పేర్కొన్నారు.
వివిధ రకాల మెడిసిన్స్‌పై జీఎస్టీని 12శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల మొత్తం చికిత్స భారం సైతం తగ్గనున్నది. అవసరమైన చికిత్సలు చౌకగా మారనున్నాయి. ఈ సంస్కరణలు అవసరమైన వారికి మందుల లభ్యతను మెరుగుపరుచడంతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో విస్తృత లభ్యతను నిర్ధారిస్తాయని.. అందరికీ సరసమైన ఆరోగ్య సంరక్షణ అనే విధానానికి దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యం, శస్త్ర చికిత్సలు, దంత తదితర సేవలకు ఉపయోగించే వైద్య పరికరాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల జేబులపై పడే భారాన్ని తగ్గిస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. చికిత్సలకు సంబంధించిన ఖర్చలు తగ్గిస్తే ఎక్కువ మంది సకాలంలో చికిత్స చేసుకోవడానికి వస్తారని.. దాంతో జీవన నాణ్యత పెరుగుతుందన్నారు. ఆరోగ్య రంగంలో సానుకూల సామాజిక మార్పు దిశలో ఈ నిర్ణయం ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.