Insurance – GST | జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసింది. శనివారం జై సల్మేర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. బీమా రంగంపై ఏర్పాటైన మంత్రుల బృందానికి సారధ్యం వహిస్తున్న బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపుపై మరింత చర్చ జరపాల్సిన అవసరం ఉందని శనివారం చెప్పారు. జనవరిలో మరోమారు మంత్రుల బృందం సమావేశం అవుతుందన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపుపై ప్రతిపాదించడానికి ముందు మరోసారి తమ మంత్రుల బృందం సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. గ్రూప్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత బీమా పాలసీ లేదా సీనియర్ సిటిజన్ల బీమా పాలసీ తదితర అంశాలపై మరోసారి చర్చిస్తామన్నారు.
ఇంతకుముందు సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా బీమాపై జీఎస్టీ హేతుబద్ధీకరణ మంత్రుల బృందం.. రూ.5 లక్షల వరకూ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించాలని సామ్రాట్ చౌదరి బృందం ప్రతిపాదించింది. బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించడం వల్ల తమ ఆదాయం పడిపోతుందని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.5 లక్షలు దాటిన ఆరోగ్య బీమాపై 18 శాతం జీఎస్టీ రేటు యధాతథంగా కొనసాగుతుంది.