GST collections : వస్తు, సేవల పన్ను వసూళ్లలో మరోసారి భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 9.9 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.38,100 కోట్లు కాగా.. ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.49,900 కోట్లుగా ఉన్నాయి.
అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూపంలో రూ.95,900 కోట్లు, సెస్సుల రూపంలో రూ.12,300 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. దేశీయ లావాదేవీలు 8.8 శాతం పెరిగి మొత్తం రూ.1.490 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. దిగుమతి చేసిన వస్తువులపై వచ్చే ఆదాయంలో 13.56 వృద్ధితో రూ.46,919 కోట్లు సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది. రిఫండ్స్ రూపంలో రూ.19,615 కోట్లు చెల్లించగా.. నికరంగా రూ.1.76 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.