GST Collections | సుస్థిర ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో దేశీయ ఆర్థిక లావాదేవీలు పుంజుకోవడంతో మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2023 మేతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అయితే, గత ఏప్రిల్ నెలలో వసూలైన రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే తక్కువే. మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
మే నెలలో దిగుమతులు 4.3 శాతం తగ్గినా, దేశీయ లావాదేవీల ద్వారా రెవెన్యూ 15.3 శాతం పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. గత నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లు అని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత రెండు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11.3 శాతం వృద్ధితో రూ.3.83 లక్షల కోట్ల మార్కుకు చేరుకుంటే, నికర జీఎస్టీ వసూళ్లు రూ.3.36 లక్షల కోట్లతో 11.6 శాతం పెరిగాయి.