న్యూఢిల్లీ, మార్చి 1: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు అంతక్రితం జనవరి నెలకంటే తగ్గాయి. అయితే 2022 ఫిబ్రవరితో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో 12 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. 2023 జనవరిలో ఈ వసూళ్లు రూ.1.58 కోట్లు. అధిక విలువగల ఉత్పత్తుల కొనుగోళ్ల కారణంగా ఫిబ్రవరి నెలలో రూ.1,49,577 కోట్ల జీఎస్టీ పన్నులు వసూలైనట్టు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఫిబ్రవరి నెలలో 28 రోజులే కావడంతో జనవరి కంటే జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
గత నెలలో 2022 ఫిబ్రవరికంటే దేశీ లావాదేవీల ద్వారా 15 శాతం అధిక ఆదాయం సమకూరిందని, ఉత్పత్తుల దిగుమతుల ద్వారా లభించిన ఆదాయం 6 శాతం వృద్ధిచెందిందని ఆర్థిక శాఖ వివరించింది. మొత్తం జీఎస్టీ ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ రూ.27,662 కోట్లుకాగా, స్టేట్ జీఎస్టీ రూ.34,915 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.75,069 కోట్లు (దిగుమతులతో వసూలైన రూ.35,689 కోట్లు కలుపుకొని) చొప్పున వసూలయ్యాయి. రూ.11,931 కోట్లు సెస్ రూపంలో వసూలయ్యింది. ఇంత గరిష్ఠస్థాయిలో సెస్ వసూలుకావడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే ప్రధమం. తెలంగాణలో రూ.4,424 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో రూ.4,424 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. గత ఏడాది ఇదేనెలలో వసూలైన రూ. 4,113 కోట్లకంటే 8 శాతం అధికంగా వసూలయ్యాయి.