న్యూఢిల్లీ, జనవరి 1: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబర్లో 1.64 లక్షల కోట్లుగా ఉన్నట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. దీంతో 6.1 శాతం వృద్ధి కనిపించింది. 2025 నవంబర్లో రూ.1.70 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా, డిసెంబర్లో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లకు చేరింది. ఇక దిగుమతైన వస్తూత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం 19.7 శాతం ఎగిసి రూ.51,977 కోట్లుగా ఉన్నది. అయితే తెలంగాణ సహా 17 రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లు క్షీణిస్తుండటంపట్ల కేంద్ర ప్రభుత్వంలో ఒకింత ఆందోళన కనిపిస్తున్నది.
దేశీయం టెలికాం రంగ సంస్థ వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)కు అహ్మదాబాద్ సీజీఎస్టీ అదనపు కమిషనర్ కార్యాలయం నుంచి రూ.638 కోట్ల జీఎస్టీ పెనాల్టీ ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు సదరు సంస్థ గురువారం బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ ఆదేశాలతో విభేదిస్తున్న వొడా-ఐడియా.. దీనిపై న్యాయపరంగానే ముందుకెళ్తామని చెప్తున్నది.