GST in April | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో 12 శాతం గ్రోత్ నమోదైంది. 2022 ఏప్రిల్లో రూ.1.68 లక్షల కోట్లు వసూలు కాగా, గతనెలలో రూ.1.87 లక్షల కోట్ల వసూలు అయ్యాయి. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు జరగడం ఇదే ప్రథమం.
ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,87,035 కోట్లు. వాటిల్లో సీజీఎస్టీ రూ.38,440 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.47,412 కోట్లు, ఐజీఎస్టీ రూ.89,158 కోట్లు ఉన్నాయి. ఐజీఎస్టీలో విదేశీ వస్తువుల దిగుమతిపై సుంకం రూ.34,972 కోట్లు ఉన్నాయి. విదేశీ వస్తువుల దిగుమతి సుంకం (సెస్) రూ.901 కోట్లతోపాటు మొత్తం సెస్ వసూళ్లు రూ.12,025 కోట్లు నమోదయ్యాయి.
గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే దేశీయ లావాదేవీల (దిగమతి సర్వీసులతో కలిపి) నుంచి ఆదాయం 16 శాతం పెరిగాయి. గత నెల 20న అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయి. 9.8 లక్షల లావాదేవీల్లో రూ.68,228 కోట్ల చెల్లింపులు జరిగాయి. గతేడాది ఇదే రోజు 9.6 లక్షల ట్రాన్సాక్షన్లలో రూ.57,846 కోట్లు వసూలయ్యాయి.
గత ఫిబ్రవరిలో ఈ-వే బిల్లుల ద్వారా 8.1 కోట్ల లావాదేవీలు జరిగితే, మార్చిలో 11 శాతం పెరిగి 9 కోట్లకు చేరాయి. మొత్తం జీఎస్టీ వసూళ్లలో గత నెలలో కేంద్రానికి సీజీఎస్టీ రూపంలో రూ.84,304 కోట్లు కాగా, రాష్ట్రాలకు ఎస్ జీఎస్టీ ద్వారా రూ.85,371 కోట్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా, 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 22శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.18.10 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయని వెల్లడించింది. 2023-24లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరగడం గ్రోత్ రేట్ పెరుగుదలకు సంకేతం అని అసోచాం అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు.