న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ మార్చి నెలలో ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే 9 శాతం అధికమని పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడో నెలవారీ గరిష్ఠ వసూళ్లు ఇదే కావడం విశేషం. గత నెలలో దేశీయ జీఎస్టీ వసూళ్లు 5.9 శాతం ఎగబాకి రూ.1.46 లక్షలకు చేరుకోగా, దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే జీఎస్టీ రూ.53,861 కోట్లు గా నమోదయ్యాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.2.36 లక్షల కోట్ల జీఎస్టీ వసూలవగా, మే నెలలో రూ.2.01 లక్షల కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గతేడాది మొత్తానికి రూ.22.27 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు పేర్కొంది. 375 ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే నాలుగు స్లాబ్లను రెండుగా 5 శాతం, 18 శాతానికి కుదించింది.