న్యూఢిల్లీ, జూన్ 20: దేశంలోని కీలక రంగాలు కుదేలయ్యాయి. గత నెలలో గడిచిన 9 నెలల్లోనే కనిష్ఠానికి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది మే నెలలో కేవలం 0.7 శాతంగానే ఉన్నట్టు శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో తేలింది. గత ఏడాది ఆగస్టులో మైనస్ 1.5 శాతంగా ప్రధాన మౌలిక రంగాల వృద్ధిరేటు నమోదవగా, ఆ తర్వాత ఇప్పుడే అంత దారుణంగా కీలక పరిశ్రమల పనితీరు కనిపించింది. ఇక నిరుడు మే నెలలో 6.9 శాతంగా కీలక రంగాల ఉత్పత్తిలో వృద్ధిరేటు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్లో 1 శాతంగా ఉన్నది. అంతకుముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా 3.4 శాతం, 4.5 శాతంగా గణాంకాలు నమోదయ్యాయి.
ఎనిమిది కీలక రంగాల్లో నాలుగింటి పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత నిరాశపర్చింది. దీంతో సిమెంట్, ఉక్కు, బొగ్గు, రిఫైనరీ రంగాల్లో ఉత్పాదకత పెరిగినా ఓవరాల్గా కోర్ ఇండస్ట్రీ ఇండెక్స్ నిలబడలేకపోయింది. దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటానే 40.27 శాతంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో దేశ జీడీపీ నేలచూపులు చూస్తున్న ప్రస్తుత తరుణంలో కీలక రంగాల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుండటం.. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ఆర్థిక వృద్ధిరేటుపైనా అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) కీలక రంగాల వృద్ధిరేటు 0.8 శాతంగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో 6.9 శాతంగా నమోదైంది.
కీలక రంగాల ఉత్పాదక సూచీ గత నెలలో తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఐఐపీ గణాంకాలూ ఈసారి నిరాశాజనకంగానే ఉంటాయని దేశీయ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే మే నెలలో ఐఐపీ గణాంకాలు 1.5 శాతం నుంచి 2.5 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నది. ఈ ఏడాది ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతంగా నమోదైంది. మార్చితో పోల్చితే 1.2 శాతం తగ్గింది. నాడు 3.9 శాతంగా ఉన్నది.