న్యూఢిల్లీ, జనవరి 7: దేశంలోని వాణిజ్య బ్యాంక్‌లు గత ఐదేండ్లలో ఏకంగా రూ.9.54 లక్షల కోట్ల మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రైటాఫ్ చేశాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులవే రూ.7 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ కాలంలో బ్యాంక్‌లు రికవరీ చేసిన ఎన్పీఏలకంటే రైటాఫ్ చేసినవే అధికం. రిజర్వ్‌బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం ఐదేండ్లుగా లోక్ అదాలత్‌లు, డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు, సర్ఫేసీ యాక్ట్, దివాలా చట్టం వంటి వివిధ మార్గాల ద్వారా బ్యాంక్‌లు రికవరీ చేసుకున్న మొత్తం రూ. 4.14 లక్షల కోట్లే. రైటాఫ్ చేయడమంటే తాము ఈ రుణాల్ని పూర్తిగా రద్దుచేసినట్టు కాదని, వీటిని రికవరీ చేసుకోబోమని భావించరాదని బ్యాంకర్లు తరచూ వాదిస్తూ ఉంటారు. ఇదే విధంగా బ్యాంక్‌లు రికవరీ చేసుకున్న రుణాల్లో సగం రైటాఫ్ అయినవి కూడా ఉన్నాయి.
ఇచ్చిన మూలధనం కంటే కూడా రెట్టింపే
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం బ్యాంక్‌లకు ఇచ్చిన మూలధనం కంటే కూడా వాటి రైటాఫ్‌లు రెట్టింపుగా ఉండటం గమనార్హం. 2014-15 నుంచి 2020-21 మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంక్‌ల్లో కేంద్రం రూ.3.37 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ పెట్టుబడి అత్యధికంగా రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్నది. 2021 ఆర్థిక సంవత్సరంలో మాత్రం నాలుగు ప్రభుత్వ బ్యాంక్‌లకు కనిష్ఠంగా రూ.14,500 కోట్లు మూలధనంగా ఇచ్చింది. 2015-2021 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ. 7 లక్షల కోట్లకుపైగా రుణాల్ని రైటాఫ్ చేశాయి. 2019-20 ఆర్థిక సంవత్సంలో అత్యధికంగా రూ.1.83 లక్షల కోట్ల రుణాల రైటాఫ్ జరిగింది.
ఎన్పీఏలు తగ్గడానికి కారణమిదే..
ఇటీవలికాలంలో ఎన్పీఏలు తగ్గినట్టు బ్యాంక్‌లు ప్రకటించడానికి ప్రధాన కారణం భారీ మొత్తంలో మొండి బకాయిల్ని రైటాఫ్ చేయడమే. 2018 మార్చిలో 11.8 శాతంగరిష్ఠ స్థాయికి చేరిన బ్యాంక్‌ల ఎన్పీఏలు.. 2021 మార్చికల్లా 7.3 శాతానికి తగ్గాయి. ఇవి గతేడాది సెప్టెంబర్ నాటికి మరింతగా 6.9 శాతానికి దిగివచ్చినట్టు తాజా ఆర్బీఐ డాటా వెల్లడిస్తున్నది. 2021 మార్చి 31నాటికి.. గత ఐదేండ్లలో బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల్లో 5 శాతం (రూ.9.5 లక్షల కోట్లు) రైటాఫ్ చేశాయి. 2020-21లో మొత్తం బ్యాంక్‌లు రూ.2.08 లక్షల కోట్లు రైటాఫ్ చేయగా, ఇందులో ప్రభుత్వ బ్యాంక్లవి రూ.1.34 లక్షల కోట్లు. అలాగే 2020-21లో బ్యాంక్‌లు కేవలం రూ.64,228 కోట్లే రికవరీ చేసుకోగలిగాయి. మొత్తం మొండి బకాయిల్లో 14.1 శాతమే రికవరీ అయ్యాయి. ఇంత తక్కువ శాతం వసూలు చేసుకోవడం గత నాలుగేండ్లలో ఇదే ప్రథమం.