హైదరాబాద్, జనవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.118 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది గ్రాన్యూల్స్ ఇం డియా. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.126 కోట్ల లాభంతో పోలిస్తే 6 శాతం తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం రూ.1,156 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం ఈసారి త్రైమాసికంలో రూ.1,138 కోట్లకు తగ్గినట్లు పేర్కొం ది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..ఉత్తర అమెరికా నిరాశాజనక పనితీరు కనబరిచినప్పటికీ లాభాలను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో అమెరికా నియంత్రణ మండలి హైదరాబాద్లో ఉన్న ప్లాంట్లో తనిఖీలు చేసి పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు, మళ్లీ అక్టోబర్లో తిరిగి ప్రారంభించడం కూడా ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.