హైదరాబాద్, మే 28: ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభంలో 17 శాతం వృద్ధిని కనబరిచింది. ఫార్ములేషన్ విభాగంలో అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.152 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.130 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,176 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.4,482 కోట్ల ఆదాయంపై రూ.501 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. మరోవైపు రూ.1 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.1.5 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.