న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వాహన వినియోగదారులు పూర్తిగా విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కంటే బహుళ ఇంధన వినియోగ సామర్థ్యం వున్న హైబ్రిడ్ వాహనాల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది.
‘షిఫ్టింగ్ గేర్స్: అండర్స్టాండింగ్ ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్ ట్రెండ్స్’ పేరిట గ్రాంట్ థోంటన్ భారత్ నిర్వహించిన ఈ సర్వేలో 40 శాతం మంది హైబ్రిడ్ వాహనాలపట్ల ఇష్టాన్ని కనబరిస్తే, 17 శాతం మంది మాత్రమే ఈవీలపట్ల ఆసక్తిని ప్రదర్శించడం గమనార్హం. ఇక ప్రీమియం మోడళ్లకు 85 శాతం మంది మోజు చూపడం విశేషం. దేశవ్యాప్తంగా 3,500 మంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోగా.. ప్రస్తుత ఈవీ ట్రెండ్‌కు భిన్నంగా ఫలితాలు రావడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
మరోవైపు ఇప్పటికీ 34 శాతం మంది పెట్రోల్ ఆధారిత వాహనాలనే కావాలంటుండటం గుర్తించదగిన అంశంగానే నిలుస్తున్నది. కాగా, దేశవ్యాప్తంగా ఈవీల వినియోగానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం, చార్జింగ్ స్టేషన్లు అక్కడక్కడానే కనిపిస్తుండటం, ప్రోత్సాహకాలు కూడా పెద్దగా ఉండకపోవడం వల్లే ఎక్కువ మంది ఈవీలను కొనేందుకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయాలు సర్వేలో వ్యక్తమయ్యాయి. రెండు అంతకంటే ఎక్కువ ఇంధన వనరుల (పెట్రోల్, డీజిల్, గ్యాస్, సీఎన్జీ, బ్యాటరీ) వాడకం ద్వారా నడిచే వాహనాలనే హైబ్రిడ్ వెహికిల్స్‌గా పేర్కొంటున్న విషయం తెలిసిందే.