Midwest IPO | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న అతిపెద్ద బ్లాక్ గెలాక్సీ గ్రానెట్ తయారీ సంస్థ మిడ్ వెస్ట్ (Midwest) ఐపీఓకు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ (SEBI)’ ఆమోదం తెలిపింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.650 కోట్ల నిధులు సేకరించాలని మిడ్ వెస్ట్ అంచనా వేసింది. ఐపీఓలో కొంత నిర్ధిష్ట వాటాలను సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా రిజర్వ్ చేయనున్నది. ఐపీఓలో తాజా షేర్ల జారీ ద్వారా రూ.250 కోట్లు, ప్రమోటర్ల వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.400 కోట్ల నిధులను సేకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)లో తెలిపింది.
ఓఎఫ్ఎస్లో సంస్థ ప్రమోటర్ల (కొల్లారెడ్డి రామరాఘవరెడ్డికి చెందిన రూ.360 కోట్లు, గుంటక రవీంద్రారెడ్డికి చెందిన రూ.40 కోట్ల) వాటాలను విక్రయించనున్నారు. అలాగే ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ రౌండ్ ద్వారా రూ.50 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది మిడ్వెస్ట్. ఒకవేళ ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ సబ్ స్క్రిప్షన్ పూర్తయితే, ఐపీఓ సైజ్ తగ్గుతుంది. గతేడాది అక్టోబర్‌లో ఐపీఓకు వెళ్లేందుకు సెబీకి మిడ్ వెస్ట్ దరఖాస్తు చేసింది. దీనిపై ఐపీఓకు వెళ్లేందుకు ఈ నెల నాలుగో తేదీన సెబీ నుంచి మిడ్ వెస్ట్‌కు లేఖ అందింది.
నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న క్లీన్ టెక్ సంస్థ రైట్వాటర్ సొల్యూషన్స్ (ఇండియా) రూ.745 కోట్ల నిధుల సేకరణకు ఐపీఓకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.445 కోట్ల నిధులు సేకరించడానికి అనుమతించాలని కోరింది. ప్రమోటర్లు వినాయక్ శంకర్రావు గాన్ రూ.85 కోట్లు, అభిజిత్ వినాయక్ గాన్ రూ.90 కోట్ల వాటాలను విక్రయిస్తారు. వాటర్ యాక్సిలరేషన్ ఫండ్ ఎస్ఎల్పీ ద్వారా రూ.270 కోట్ల విలువైన సెక్యూరిటీలను డిపాజిట్ చేయనున్నారు. మొత్తం కంపెనీలో ప్రమోటర్ల వాటా 80.13 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటా 19.87 శాతం ఉంటుంది.