తిరుమల : ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ( TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకోగా 26,150 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రచించిన ‘శ్రీవారి దివ్య ప్రసాదములు’ అనే పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాలు గురించి పూర్తి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచినట్లు చైర్మన్కు పుస్తక రచయిత రమణ దీక్షితులు వివరించారు.