Trade talks : అమెరికా (USA) తో వాణిజ్య చర్చల (Trade talks) కు భారత్ సిద్ధమైంది. భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య నాలుగు రోజులపాటు ఈ వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల కోసం భారత ఉన్నతాధికారుల బృందం ఈ నెల 16న వాషింగ్టన్ (Washington) కు చేరుకోనుంది. ఈ బృందానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal) నాయకత్వం వహించనున్నారు.
ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగురోజులపాటు భారత్-ఆమెరికా దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని భారత వాణిజ్య శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్‌తో, వాణిజ్య శాఖ కార్యదర్శి హొవార్డ్ లూట్నిక్తో పీయూష్ గోయెల్ బృందం భేటీ కానుంది. రెండు దేశాలకు చెందిన ముఖ్య ప్రతినిధులు మే 19 నుంచి 22 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా స్టీల్, అల్యూమీనియం సహా భారత వస్తువులపై అమెరికా టారిఫ్‌లు విధించడంతో.. అమెరికాకు చెందిన వివిధ వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లు విధించాలని భారత్ నిర్ణయింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు కూడా తెలియజేసింది. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.