ముంబై, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటా అమ్మకానికి తెరతీసింది. ఖజానాకు రూ.1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 7 శాతం వాటాను విక్రయించనున్నది. అది కూడా ప్రస్తుత మార్కెట్ ధరకంటే భారీగా 12 శాతం డిస్కౌంట్‌తో ఆఫర్‌ను తీసుకొస్తున్నది. ఈ నెల 18-19 తేదీల్లో వచ్చే ఓఎఫ్‌ఎస్‌కు షేరుకు రూ.79 చొప్పున ఫ్లోర్ ధరను నిర్ణయించింది.
మంగళవారం బీఎస్ఈలో హడ్కో షేరు రూ.89 వద్ద ముగిసింది. ఓఎఫ్ఎస్ తొలిరోజున 7 కోట్ల షేర్లను (3.5 శాతం వాటా) ఆఫర్ చేస్తుండగా, మరుసటి రోజున గ్రీన్‌షూ ఆప్షన్‌గా మరో 7 కోట్ల షేర్లు విక్రయించనున్నది. 18న రిటైల్ ఇన్వెస్టర్లకు, 19న నాన్-రిటైలర్లకు ఆఫర్ ఉంటుంది. ప్రస్తుతం హడ్కోలో కేంద్రానికి 81.8 శాతం వాటా ఉన్నది. తాజా విక్రయంతో ఈ వాటా 74.8 శాతానికి దిగివస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల్ని అమ్మడం ద్వారా రూ.51,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయించుకుంది.